Saturday, October 31, 2009

తాగిన వాడి నోట

తాగిన వాడి నోట నిజాలే వస్తాయంటారు.కే సి ఆర్ గారు మాత్రం తాగడం మానేశాక చాలా నిజాలు చెప్తున్నారు. లుచ్ఛాలు లఫంగులు ఇత్యాదులు. నిజానికి నేటి రాజకీయ నాయకులున్న ఏ ఫొటోని చూసినా రోగ్స్ గాలరీ లాగే వుంటుంది. కేసీఆర్ కూడా అందులోనివాడే అన్నది మనకీ తెలుసనుకోండి. అయితే బాధాకరమైనదేమిటంటే ఇదే తెలంగాణా ప్రజల భాష అని ఆయన దబాయిస్తున్నారు. నాకు తెలంగాణా మిత్రులెంతమందో వున్నారు. లబ్ధప్రతిష్ఠులైన తెలంగాణా మహామహులెందరో వున్నారు. కీర్తిశేషుల దాశరధి కృష్ణమాచార్యులు గారూ, ఇంకా మనతోవున్న సి నా రె , నేటితరం అశోక్ తేజ, చుక్కా రామయ్య గారు, దెవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, యెవరైనా యెప్పుడైనా పదిమందిలో ఇలా మాట్లాడడం యెక్కడా వినలేదు.మరి వీరిలో ఎవరూ ఆయన్ని ఖండించకపోవడం శోచనీయం. ముంబైలో రాజ్ థాకరే లాగ ఈయనకీ భయపడుతున్నారా? బురదలో కాలెందుకు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? తెలుగుతల్లి పాటని అవమాన పరుస్తుంటే తెలంగాణా మేధావులు యేంచేస్తున్నారు? పురుగుల్ని నలిపెయ్యాలని ఎప్పటికి గుర్తిస్తారు?

Sunday, October 18, 2009

మమ్మల్నిలా వదిలేయండి

రాజశేఖరరెడ్డి పోయాక కావాలనే కొన్నాళ్ళు రాయలేదు.నా భావాలు దుమారం లేపచ్చని ఊరుకున్నాను. ప్రజలు కోరుకుంటున్నారని రజకీయనాయకులూ సినిమాల వాళ్ళూ చాలాచాలా అంటున్నారు. మమ్మల్నిలా వదిలేయండి బాబులూ. మీక్కావలసింది మీరు చేసుకోండి. మా బతుకులెలాగా మేమే బతుకుతున్నాం కద! హైదరాబాదు ఎక్స్ ప్రెస్ హైవే కి పీ వీ గారి పేరు మార్చమంటున్నారు. వెళ్ళినప్పుడల్లా టోల్ టాక్స్ కట్టమనే చోట పిచ్చి బ్రాహ్మడికన్నా వై ఎస్ ఆర్ పేరే రైటేమో!

Sunday, August 30, 2009

ట్రోజన్ ?

ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తలో వారు ఆంతరంగికంగా మాట్లాడుకున్న విషయాలన్నీ తెలుగుదేశం వారికి చేరిపోతున్నాయని పెద్ద గందరగోళమే జరిగింది.ఇప్పుడు వీలయినంత తొందరగా సొంత గూటికి యెగిరిపోతున్న పక్షుల్నీ వాటికి లభిస్తున్న స్వాగతాల్నీ వీరతాళ్ళనీ చూస్తుంటే మిషన్ ఎకాంప్లిష్డ్ అనిపిస్తోంది. స్వగృహ ప్రవేశాన్ని నిరసించిన ఒకరిద్దరికి కూడా నిజాన్ని లోపాయకారీగా చెప్పి నోరు మూయించారేమో!పాపం చిరంజీవి. ఇప్పటికైనా ఎన్ టీ ఆర్ యేం చేశారో చూసి తన విసనకర్రలకి ప్రాధాన్యం ఇవ్వడం మొదలెడితే బాగుంటుంది. మరో సంగతి జనాన్ని చూసుకుని తనూ ఎన్ టీ ఆర్ అంత వాడిననే భ్రమనించి బయటకి రావాలి. పుటం పెట్టినా సీతారామకళ్యాణం వంటి దాన్ని ఊహించి సృష్టించే స్తోమతు తనకి లేదు కదా!జ్ఞానపీఠ్ వచ్చినవారంతా త్యాగరాజులు కన్నా గొప్ప కాదుకద!

Monday, August 24, 2009

వేళాకోళం

కందిపప్పు వంద దాటింది మిగిలినవీ అంతే. బియ్యం రోజు రోజుకీ పెరుగుతోంది.ధరల సూచీ మాత్రం తగ్గి తగ్గి నెగెటివ్ అయిందట! వేళాకోళమా? ఈ సాకుతో పాపం ప్రభుత్యోద్యోగులకి ఇచ్చే డియ్యే యెగ్గొడ్తారు.[నేను ప్రభుత్వోద్యోగిని కాను]
ఈ అర్ధిక శాస్త్రవేత్తలనీ స్టాటిస్టీషియన్లనీ ప్రజలు చొక్కా పుచ్చుకుని నిలదీసే రోజు ఇంకా రాలేదా. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళూ సైంటిస్టులూ జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళూ
చేస్తున్న మోసాలు ఇన్నీ అన్నీ కావు. ఈ సంవత్సరం 101 శాతం వర్షాలు పడతాయని మేలో చెప్పిన వాణ్ణి కొరడా పట్టుకుని కొట్టద్దా? మళ్ళీ ఆ నోటితోనే జూన్ లో 50 శాతం అని మార్చేడు.
ఒక్కొక్క వ్యక్తి సమస్త శక్తీ ధారపోసి వీళ్ళ తాటలు వొలవాలి.

Sunday, August 23, 2009

నట్టులు

ఈ రోజు హిందూ లో పాత తరం ఆక్టర్లకీ నేటి స్టార్లకీ తేడాగురించి వాపోయారు. నిజమే! ఒక కంటిచూపుతో ఒక పెదవి విరుపుతో ఒక నిశ్వాసంతో కోట్ల భావాలు పలికించిన ఎన్ టి ఆర్ లూ ఏ ఎన్ ఆర్ లూ సావిత్రులూ రంగారావులూ యెక్క్కడున్నారు? ఫైటింగూ డాన్సూ చెయ్యడమే నటుడికి క్వాలిఫికేషన్ అయింది. అందుకే డాన్సు మాస్టర్లూ ఫైట్ మాస్తర్లూ డైరెక్టర్లుగా అవతరిస్తున్నారు. సొంత మాటే లేని వాళ్ళకి మాట విరుపులో భావాన్ని పలికించే ప్రశ్నెక్కడ వుంది?
నట్టులు

Saturday, August 15, 2009

ఛెత్రపతి

నాకు నిన్న నిజంగా భయమేసింది. నిన్న సాయంకాలం టీ వీ లో చత్రపతి అనే దరిద్రగొట్టు సినిమా వచ్చింది.సెలవులకి వచ్చిన మా ఆరేళ్ళ మనమడి బలవంతం మీద చచ్చినట్టూఉ ట్యూన్ చేశాను. ఆ సినిమాలో ఒక కొడుకు తన అన్నకి తల్లి ప్రేమ తనకన్నా యెక్కువ దక్కకూడదని యెంతో కసి తో వుంటాడు.వాడు కోపం ప్రదర్శించే దృశ్యాలు అన్నమీద చూపించే కసి మా వాడు యేంత శ్రధ్ధగా చూస్తున్నాడో గమనించాక నాకు నిజంగా భయం వేసింది.మాటలలో పెట్టి ఛానెల్ మార్చాననుకోండి..అయినా ఇలాటి సినిమాలా. మామూలు వయొలెన్స్ అయినా కొంత పరవా లేదు.పెర్సనల్ గా రిలేట్ అవవు.కాని ఇదేమిటి.

Friday, August 7, 2009

యేం పిల్లడో

మగధీర వివాదం సమాజంలో నిండిన అసహనానికీ కీర్తి కాంక్షకీ అద్దం పడుతోంది. యెప్పట్నించో శ్రికాకుళం పల్లె ప్రజలు వలస పోతూ పాడుకున్న పాటల పల్లవిని వాడుకుని అంతో ఇంతో పేరు తెచ్చుకున్న మనిషి ఇప్పుడు అది తన సొత్తేననడం హిపోక్రసీ కాక మరేమిటి. ప్రజల సొత్తు అని గొంతు చిచుకునే వాళ్ళకి ఇప్పుడు ఆ పాటని సినిమాలో ఆదరిస్తున్న కుర్రకారు ప్రజల్లా కనిపించరా! ఈ ప్రజా సంఘాలకున్న రోగమే అది. వాళ్ళూ వాళ్ళు చెప్పిన వాళ్ళూ తప్ప మిగిలిన వాళ్ళు ప్రజలూ కారు వాళ్ళకి సివిల్ లిబర్టీలూ వుండవు.జానపద గీతాన్ని సినిమాలో వాడడమంటే అది అనాదిగా వస్తున్నదే.మొక్కజొన్న తోటలో కాని కాంభోజరాజు కధ తీసినప్పుడుగాని .సినిమా వాళ్ళ హిపోక్రసీ అంటే అది మరోకధ.యెవరు హిపోక్రాట్లు కాదు? ఒక సంగతి గుర్తుంచుకోవాలి.విప్లవ గీతాలు రాసిన వాళ్ళందరూ శ్రీశ్రీ లు కారు..ప్రణయగీతాలు రాసిన వాళ్ళందరూ కృష్ణశాస్త్రులు కారు...జానపదగీతాలు పాడిన వాళ్ళందరూ సీతా అనసూయలూ గద్దర్లూ కారు.
కొస మెరుపు: ఇప్పుడు మా టీవీ సూపర్ సింగర్ లో జానపద గేయాలు పాడి కాష్ బహుమతులు పొంది అమెరికాలు వెళ్ళి నేడో రేపో సినిమాల్లో పాడేవాళ్ళని యేమనాలి

Monday, July 27, 2009

కలదుకలందనేది కలదోలేదో

నిత్య కాన్స్టిపేషన్ మొహంతో వుండి యెప్పుడూ రెందు వేళ్ళు చూపిస్తూ వుండేవాడొకడూ , మహామూర్ఖుడిలాగా నిరంతరం పిచ్చినవ్వులు నవ్వుతూ వుండేవాడింకొకడూ వీళ్ళ వెనక కేతిగాళ్ళూ వీళ్ళు మన ప్రజాస్వామ్యానికి కాపలాదార్లా ?వీళ్ళమొహానికి ఛాలెంజిలొకటా?మాట్లాడితే సిట్టింగుజడ్జిలూ ఎలెక్షన్ కమిషనూ...అత్యంత ప్రతిభావంతులైన ఆఫీసరులూ న్యాయమూర్తులూ పోలీసులూ యెంతకష్టపడి ఇన్ని పరీక్షలు రాసి ఇంటర్వ్యూలెదుర్కుని ఆ స్థానానికి వచ్చేరు? ఈ పిచ్చివెధవల తగువులు తీర్చడానికా? ప్రజాస్వామ్యం మీద నమ్మకముంటే అని అరిచి చస్తున్న ఆ మనిషి నిన్నమొన్న జరిగిన యెన్నికలు యేమనుకుంటున్నాడు? ఆయనకి వోటు పడకపోతే లెక్క లోనికి రావా?మన అదృష్టం కొద్దీ వీళ్ళతో యే అవసరాలూ లేని జే పీ చిరంజీవీ అక్కడ వుండి కొంచెం సేనిటీ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజల సొమ్ము పాడు చేస్తున్నందుకు నాయుదుకీ రెడ్డికీ జీవితఖైదు విధించే నాధుడు లేడా?

Tuesday, July 21, 2009

నీతా? అంటే యేమిటి?

గత పోస్టు తరువాత రెండు సంగతులు జరిగాయి.ఒకటి యె ఐ సి టి యి అరెస్టులు. హాచ్చెర్యం అరెస్టులు జరగడం...లంచాలు తీసుకోడం కాదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల అన్నట్టు లంచాల సంగతి ఇప్పుడెందుకు? స్వయంగా కొన్ని కమిటీల్లో కాలేజిల అధ్వాన్న స్థితి గమనించీ రిపోర్టిచ్చీ యేమీ కాకపోవడం గమనించిన నా లాటి వాళ్ళకి ఇందులో విశేషమేమీ లేదు.బహుశా ఆకాలేజీల విద్యార్ధులకీ వారి తల్లిదండ్రులకీ కూడా అంతే.యెవరీ బాధిత పార్తీ అన్నదే ప్రశ్న. వాటాలు చాలని వాళ్ళా .. ఇప్పటికే చాలామందికి ఇచ్చిన వాళ్ళా.. తెలిసే అవకాశం లేదు.
ఎం ఎల్ యే రామారావు కేసు రోజు రోజు కీ జుగుప్సాకరంగా తయారవుతోంది.అలాంటి ఆరోపణలు యెదుర్కుంటున్న వ్యక్తిని టీడీపీ యెందుకు వెనకేసుకువస్తోంది? రాజశేఖర రెడ్డిని తూలనాడడానికి యేదైనా వోకేనా? రాజకీయం ప్రవేశించకముందు అన్ని ఛానెళ్ళలోనూ రామారావు నీళ్ళటాంకు దగ్గిర దాక్కోడం ప్రముఖంగా చూపించారే! యేదీ జరక్క పోతే మరి దాక్కున్నదెందుకు?నీతికి కట్టుబడే రాజకీయంలో నిజం తేలే దాకా వేచి వుండడం జరగాలి. నీతా? అదేమిటి?

Wednesday, July 15, 2009

హ హ్హ హ్హ

త్వరలో ప్రజలందరికీ 24 గంటలూ నీళ్ళ సరఫరా అట!మన నగరాలు ప్రపంచ స్థాయికి చేరుతాయి[ట] యెవరిని వేళాకోళం చేస్తున్నారు? తెలుగు ప్రజలు హాస్యప్రియులు కాబట్టి సరిపోయింది.పాతకాలంలో టీవీలో సిట్ కాం లనబడే కామెడీ సీరియళ్ళు వచ్చినప్పుడు వాటిలో లాఫ్ ట్రాక్ ఉండేది.మనం నవ్వాలని గుర్తు చెయ్యడానికి. ఈ రోజుల్లో వార్తలు వచ్చేటప్పుడు లాఫ్ ట్రాక్ పెడితే బాగుంటుంది. ప్రధానమంత్రి ఇలా అన్నారు[హ హ్హ హ్హ] ప్రతిపక్షనేత మేమైతేనా అన్నారు [హ హ్హ హ్హ హ్హ] అలా అన్న మాట. సంఖ్య ఎక్కువైన వార్తా ఛానెళ్ళలో ఎవరైనా ఈ వెరైటీ ట్రై చేస్తారా?

Tuesday, July 14, 2009

దేశం యేమయ్యెట్టు

రాజశేఖరరెడ్డిగారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నెట్ లో కాంపైన్ మొదలైందట! అలనాటి క్లాసిక్ కథానాయకుడు సినిమా లోని నాగభూషణం డైలాగు గుర్తొచ్చింది. అల్లు రామలింగయ్య ధరించిన అప్పడు అనే మునిసిపల్ కౌన్సిలర్ తన శిలా విగ్రహం పెట్టించమని అడిగిన సందర్భంలో దేశం యేమయ్యెట్టు అని తన టిపికల్ స్వరంలో అంటాడు. ఇప్పుడు ప్రపంచం యేమయ్యేట్టు అనాలా!.అన్నీ పురాణాల్లోనే వున్నాయి అన్నట్టు అన్నీ కన్యాశుల్కంలోనే వున్నాయి. అసెంబ్లీ లో బాబు గారు నిప్పులు చెరుగుతున్నప్పుడు రెడ్డి గారి నవ్వు చూస్తే అగ్నిహొత్రావధాన్లు ఉక్రోషంతో ప్లీడర్ని నీ ఇంట కోడి కాల్చా అని శాపనార్ధం పెడితే నెమ్మదిగా 'రోజూ కాలుస్తూనే వుంటారూ అని ఆ నాయుడు అనబడే ప్లీడరు సమాధానం ఇవ్వడం గుర్తొస్తుంది..

Monday, July 13, 2009

నోరా

నన్నపనేని రాజకుమారి గారు మాట తూలి రాళ్ళ వర్షానికి గురయ్యారు. అవతల వాళ్ళు కూడా హద్దుమీరడం తప్పితే ఇదొక వార్తా? మొన్నటికి మొన్న రాజధానిలో రాజకీయాలకి సంబంధంలేని బ్రహ్మానందం సన్మానసభలో నోరుజారి బ్రహ్మానందం చేత చెంపపెట్టులాంటి మాట అనిపించుకున్నారు. నోరా వీపుకి తేకే అన్న నానుడి ఎప్పటికి అర్ధం చేసుకుంటారో. బాధాకరమైన విషయం యేమంటే ఆవిడ అధినేత కూడా ఈ మార్గమే ఉత్తమమని తనూ అనుసరించే సూచనలు ఈ మధ్య కనిపిస్తున్నాయి.ఆయన చతురతతో జ్ఞానంతో దూరదృష్టితో ఆంధ్ర దేశానికి చేయవలసిన మేలింకా చాలా మిగిలి వుంది.ఆయన నాయకత్వం కోసం జాతి యెదురు చూస్తోంది. పెద్దమనిషి తరహా వదిలేసి ఇలా పక్కదారి పట్టడం శోచనీయం.బాబు గారూ మామీద దయ తలచండి.

వాస్తువంకాయ

చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కేంద్రకార్యాలయంలో గేటు తీసేయించి గోడ కట్టిస్తున్నారని వార్తా విశేషం.నిన్న రోజంతా టీవీఛానెళ్ళు ఊదరగొట్టేశాయి.అక్కడ ఉండకూడని దిక్కులో గేటు ఉండడం చాతనే ఆయన దశ బాగాలేదని వాస్తు విజ్ఞానులు నొక్కి వక్కాణించారని ఉవాచ. మరి వారు తొమ్మిది సంవత్సరాలు ఒక వెలుగు వెలిగినప్పుడు ఆ గేటు అక్కడే ఉన్నట్టుందే?తన రాజకీయ చతురతా వ్యక్తిత్వమూ యేవీ పని చెయ్యవా? తమ పార్టీ విధానాలకన్నా జూనియర్ ఎన్ టీ ఆర్ జనాకర్షణ యెక్కువ ప్రభావం చూపుతుందని కూడా నమ్మారు!ఛానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాలు ప్రతి వూరిలోనూ ఒకే పాట కంఠతా పెట్టి పాడిన విషయం కళ్ళకి కట్టించాయి. ఏమిటో!